ఈనెల 18న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కరీంనగర్ లో ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. అభివృద్ది వికేంద్రికరణలో భాగంగా కరీంనగర్ లో ఐటీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేసే వారికంటే కరీంనగర్ లో ఐటీ ఉద్యోగం చేసే వారికి రూ.30వేలు ఆదా అవుతుందన్నారు. ఈ ఐటీ కంపెనీలలో స్ధానికులకే 80శాతం ఉద్యోగ కల్పన ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొత్తం 3వేల నుంచి 3వేల 500 మందికి ఇక్కడ ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. తొలుత 12 కంపెనీలతోనే ప్రారంభించాలని భావించామని పేర్కొన్నారు. ఏడాది తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు. కాగా 2018 జనవరి 8న మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ నిర్మానానికి శంకుస్ధాపన చేశారు.