తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకున్నారన్నారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటిపల్లిలో ఐటీ పార్క్ నిర్మాణానికి నేడు శంకుస్ధాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల పాలన వల్లే పాలమూరు ప్రజలకు కష్టాలు తప్పడం లేదన్నారు. నాలుగేండ్లలో పాలమూరును పచ్చగ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కడితే..కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈరోజు పాలమూరు జిల్లా చరిత్రలో లిఖించదగ్గ రోజని… పాలమూరులో ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈపార్క్ లో దాదాపు 100పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ ఐటీ టవర్ నిర్మాణానికి రూ. 50కోట్ల మంజూరు చేసి రాబోయే 9నెలల్లోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈపార్క్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పాలమూరు బిడ్డలు వలస వెల్లనవసరం లేదన్నారు.
పాలమూరు పార్క్ లో ప్రత్యక్షంగా 10వేల మంది, పరోక్షంగా మరో 15వేల మంది కార్మికులు పని చేసే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఉమ్మడిపాలమూరు జిల్లా అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏవిధంగా సాధించుకున్నామో..అదేవిధంగా పాలమూరును అభివృద్ది చేసేంతవరకూ తమవంతు కృషి చేస్తామన్నారు. గడిచిన నాలుగేండ్లతో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. జడ్చర్ల – మహబూబ్‌నగర్ మెయిన్‌రోడ్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు.