వరంగల్‌లో నిన్న జరిగిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీకి వత్తాసుగా మాట్లాడితే ఊరుకోను అని రాహుల్ గాంధీ నిన్న వరంగల్ సభలో మాట్లాడారు అని కేటీఆర్ గుర్తు చేస్తూ.. గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పజెప్పావని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన నింపుకున్న వ్యక్తికి అప్పజెప్పావు. నీవు ఏం తెల్వనోనివి. రాసిస్తే చదివి పోయే వ్యక్తివి. అభం శుభం తెలియని అమాయకుడివి అజ్ఞానివి.. అంతకే ఉంటే మంచిదని రాహుల్‌ను కేటీఆర్ హెచ్చరించారు.
టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోని సంబంధం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ ఏఐసీసీకి కొత్త అర్థం చెప్పారు. ఏఐసీసీ అంటే ఆలిండియా క్రైసిస్ కమిటీ అంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ లో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ లో కొత్త అంశాలేవీ లేవని అన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. మాకు ఇతర పార్టీలకు బీ టీమ్, సీ టీమ్ అయ్యే దౌర్భాగ్యం పట్టలేదు. మేం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీమ్. తొత్తులుగా ఉండే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ పేరే స్కాంగ్రెస్. ఎ టు జడ్ అన్ని కుంభకోణాలే. ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుంటే.. పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్ని కుంభకోణాలే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.