సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కింది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపి నిర్మాతలు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేష్ తన ఫ్యాన్స్ కోసం బహిరంగ లేఖ రాశారు.
ప్రియమైన అభిమాన మిత్రులకు… ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ ముగించుకుని, అన్ని పనులు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ మూవీ ఆడియో ‘సరేగమ’ కంపెనీ ద్వారా మార్కెట్లో విడుదలై రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోందని తెలిపారు. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న మన ‘సర్కారు వారి పాట’ చిత్రం థియేటర్లలో చూసి మీ స్పందన తెలియజేయగలరు. మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం అవుతుంది. ‘ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి’ అంటూ మహేశ్ తన లేఖను ముగించారు.


