మోహినికుంటలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. మరో 6,825 ఇండ్లు జిల్లాలో కట్టుకోబోతున్నామని తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, మోహినికుంట గ్రామంలో రూ.3.27 కోట్లతో పేదల కోసం నిర్మించిన 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కోసం రూ. 75 వేలు వారు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రూ. 5 లక్షలతో డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే మోహినికుంట గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులగా ముందుకెళ్తున్నాయని మంత్రి చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యంలో ఏ పార్టీ చేయని అభివృద్దిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వేసవి కాలంలోనూ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్రం అవార్డులు మాత్రమే ఇస్తుంది కానీ నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.