బీజేపీ తీరును వ్యతిరేకించాలి- మంత్రి కేటీఆర్‌

68
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేశారు. యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరైయ్యారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. యశ్వంత్‌ సిన్హాకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ లేకపోయినా తప్పుడు మార్గాల్లో అధికారం పొంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఫైర్‌ అయ్యారు.

రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని.. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ బీజేపీ తీరును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ.. విపక్షాల అభ్యర్థిని బలపరిచామని ప్రకటించారు. అయితే ఎన్డీయే రాష్ట్ర పతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్‌ఎస్‌ బృందం కూడా హాజరైంది. ఇందు కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు డాక్టర్ రంజిత్‌ రెడ్డి, సురేశ్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, వెంకటేశ్‌ నేత, కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు పాల్గొననున్నారు.

- Advertisement -