మంత్రి ఎర్ర‌బెల్లికి కేటీఆర్ స‌త్కారం..

287
ktr
- Advertisement -

దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌తీ స‌శ‌క్తి క‌ర‌ణ్ పుర‌స్కార్ కింద దేశంలోనే అత్యుత్త‌మ స్థానిక సంస్థ‌లుగా 12 పుర‌స్కారాలు రాష్ట్రానికి రావ‌డం ప‌ట్ల రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు, రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు శుభాకాంక్ష‌లు తెలిపి, స‌త్క‌రించారు. అలాగే పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావుల‌ను స‌న్మానించి, అభినందించారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గురువారం మంత్రులిద్ద‌రూ క‌లుసుకున్న సంద‌ర్భంగా కేటీఆర్ ఎర్ర‌బెల్లితో కొద్దిసేపు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా ప‌ని చేస్తూ, దేశంలోనే అత్యుత్త‌మ గ్రామ పంచాయ‌తీలు 9, మండ‌లాలు 2, జిల్లా ప‌రిష‌త్ ఒక‌టి చొప్పున అవార్డులు రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. గ‌తంతో స‌హా వ‌ర‌స‌గా అవార్డులు వ‌స్తుండ‌టం ప‌ట్ల మంత్రి కేటీఆర్ అభినందించారు. అలాగే రాష్ట్రానికి అవార్డులు వ‌చ్చే విధంగా ప‌ని చేస్తున్న అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, సిబ్బంది ప్రతి ఒక్క‌రినీ కేటీఆర్ అభినందించారు.

సీఎం కేసీఆర్ వినూత్నంగా చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్ గా న‌డుస్తున్న‌ద‌న్నారు. ప్ర‌తి నెలా ఇస్తున్న 308 కోట్లు గ్రామాల అభివృద్ధికి తోడ్ప‌డుతున్నాయ‌న్నారు. దేశంలోనే మొద‌టి సారిగా తెలంగాణ రాష్ట్రంలో అస‌లైన గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న సీఎం కేసీఆర్ హ‌యాంలో జ‌రుగుతున్న‌ద‌న్నారు. ఇప్పుడు గ్రామాల్లో ట్రాక్ట‌ర్లు, ట్రాలీలు, ట్యాంక‌ర్లు వ‌చ్చాయ‌ని, న‌ర్స‌రీలు, డంపుయార్డులు, ప‌ల్లె ప్ర‌కృతివ‌నాలు, స్మ‌శాన‌వాటిక‌లు ఏర్ప‌డ్డాయ‌ని, నిత్యం పారిశుద్ధ్యం జ‌రుగుతుండ‌టంతో గ్రామాలు అద్దాల వ‌లె త‌యార‌య్యాయ‌ని మంత్రి చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో క‌రోనా వ్యాప్తి త‌గ్గ‌డ‌మే గాక‌, అంటు, సీజ‌నల్ వ్యాధుల జాడేలేకుండా పోయింద‌ని చెప్పారు. ఇదే త‌ర‌హా ప‌ని తీరుని కొన‌సాగిస్తూ, రాష్ట్రానికి మ‌రింత పేరు వ‌చ్చే విధంగా ప‌ని చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.

- Advertisement -