ప్రియాంక రెడ్డి ఘటనపై మోదీకి ట్వీట్ చేసిన కేటీఆర్

504
ktr
- Advertisement -

ప్రియాంక రెడ్డి హత్యాచారం నేపథ్యంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల పైన కఠిన చట్టాల కోసం పార్లమెంటులో ఒక రోజుపాటు చర్చించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాల్లో నిందితులు పట్టుబడిన్నప్పటికీ, వారికి వేసిన శిక్షల అమలులో తీవ్ర ఆలస్యం జరుగుతున్నదని, ఏడు సంవత్సరాల క్రితం నిర్భయ హత్యాచార ఘటనలో నిందుతులకి ఇప్పటికిీ ఉరిశిక్ష అమలు జరగడం లేదన్నారు. తొమ్మిది నెలల పసి పాప పై అత్యాచారం చేసిన నిందితుల ఉరి శిక్షను కోర్టు జీవితఖైదుగా మార్చిన సంఘటనను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య లోనూ నిందితులను వెంటనే పట్టుకున్నారని, అయితే తమ బిడ్డను కోల్పోయిన తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న ప్రియాంక రెడ్డి కుటుంబానికి ఏ విధంగా స్వాంతన చేకూర్చాలో అర్థం కావడం లేదన్నారు. ఇలా అత్యాచార నిందితులకు శిక్ష అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని ” న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లే” అన్న నానుడిని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి క్రూరమైన ఉదంతాల్లో అమలు చేయాల్సిన చట్టాలపై, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒకరోజు పాటు చర్చను చేపట్టాలని ప్రధాన మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అత్యంత హీనమైన నేరాలకు పాల్పడుతున్న నీచులకు కఠిన శిక్ష విధించేలా, కాలం చెల్లిన ఇండియన్ పీనల్ కోడ్ మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (crpc) చట్టాలను మార్చాల్సిన అవసరం ఉన్నదని, మహిళలపై, పిల్లల పైన అత్యాచారాలకు పాల్పడేవారికి ఎలాంటి ఆలస్యం లేకుండా ఉరిశిక్ష విధించాలని, వీటిపైన తిరిగి సమీక్షకు వీలులేని విధంగా చట్ట సవరణ చేయాలని కోరారు.

చట్టాలంటే భయం లేకుండా మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకునే సమయం ఆసన్నమైదని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ఆవేదన చెందుతూ, నిస్సహాయంగా న్యాయం కోరుతున్నలక్షలాదిమంది తరఫున వినతి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి తెలిపారు. చట్టసభల ప్రతినిధులమైన మనందరం, భాధితులకు సత్వర న్యాయం లభించేలా చర్యలు తీసుకునేందుకు నడుం కట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

- Advertisement -