బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో తనపై బండి సంజయ్ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. డ్రగ్స్ పరీక్షల కోసం తన ఇస్తానని, టెస్టులు చేసేందుకు బండి సంజయ్ సిద్ధమేనా అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించారు.
డ్రగ్స్ టెస్టుకు నా రక్తం ఇస్తా… వెంట్రుకలు ఇస్తా.. అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా… ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే.. బండి సంజయ్ కరీంనగర్ కమాన్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలి.. అంతే కాకుండా కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా.. నా చెప్పు దెబ్బలు కాదు.. ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా..? కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి. అని మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సిద్ధమైతే నేను ఇక్కడ్నే ఉంటా… ఏ టెస్టుకైనా సిద్ధమే.. ఏ డాక్టర్ ను తీసుకొస్తాడో రమ్మను… బండి సంజయ్ కి ఏమైనా తెలివుందా?.. ఆయన మనిషా.. పశువా.. ఇదేం రాజకీయం.. కరీంనగర్ కు ఏం జేసిండో చెప్పు అంటే చెప్పడం చేతకాదు కానీ.. పెడబొబ్బలు పెడుతుండు అని మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికైనా బండి సంజయ్ తనపై అసత్య ఆరోపణలు మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించారు.