చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానిని అన్నారు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ‘# ASKKTR@KTRTRs’ పేరిట ట్వీట్టర్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుంది అని కామెంట్ చేసిన పలువురు ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం…. ఇది కేసీఆర్ నాయకత్వానికి వచ్చిన గుర్తింపు అని కొనియాడారు.. హైదరాబాద్ నగరంలో సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం ప్రారంభమైందని త్వరలోనే మార్పు కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైనదని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. పౌర సవరణ చట్టం అమలు లు లు వంటి విషయాల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని ఒకరు ప్రశ్నించగా.. హైదరాబాద్ నగరంలో ఇతర నగరాలతో పోల్చితే నీటి కొరత చాలా తక్కువగా ఉన్నదని కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా సమస్య తలెత్తదని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని మరింత దర్శనీయ ప్రాంతంగా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించామని, చార్మినార్ గోల్కొండ పర్యాటక క్షేత్రాలు ప్రపంచ వారసత్వ సంపాదించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, యూరప్ అమెరికా వంటి ప్రాంతాల నుంచి మరిన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా రాష్ట్రంలో ఉన్న 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పని తీరుపై తమకు అవసరమైన ఫీడ్ బ్యాక్ వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని టెన్ ఇయర్స్ చాలెంజ్ అంటూ స్పందించారు. సినిమాల్లో నటించి సామాజిక సందేశం ఇవ్వాలని ఒకరు అడగగా.. ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు ఫుల్ టైం జాబ్ ఉన్నదని తెలిపారు. 2020లో ఫార్మాసిటీ ప్రారంభమవుతుందన్నారు.
మరోవైపు ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ, జగన్ పరిపాలన బాగుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు పైన ఆ రాష్ట్ర ప్రజలే సరైన నిర్ణయిం చెబుతారని, తాను కాదని అన్నారు. 2019 సంవత్సరంలో తెలంగాణలో జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో అన్ని జిల్లా పరిషత్ లను గెలుచుకోవడం ఒక మంచి జ్ఞాపకం అన్నారు.