నగర ప్రజలకు మంత్రి కేటీఆర్ భరోసా

185
ktr
- Advertisement -

భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజల్లో భరోసా నింపేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు పర్యటించారు. ఉదయమే జిహెచ్ఎంసి కార్యాలయానికి చేరుకున్న మంత్రి కే తారకరామారావు అక్కడి నుంచి అధికారులు అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పురపాలక శాఖ విభాగాధిపతులు మరియు రెవెన్యూ, హెల్త్ ,ఇతర శాఖల సెక్రటరీలు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఉదయం పూట వర్షాలు కొంత తెరిపి ఇవ్వడంతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించారు.

దీంతోపాటు విద్యుత్ సంస్థలు మరియు ఇతర శాఖల తో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని సూచించారు. నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ఉన్నతాధికారులు అంతా క్షేత్రంలో ప్రజలకి అండగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా టెలీ కాన్ఫరెన్స్ లో వారికి అనేక సలహాలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ ముగించుకున్న అనంతరం మంత్రి సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి వివిధ విభాగాల అధికారులతో కలిసి హైదరాబాద్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పైన ఒక సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.

ముందుగా ఎల్బీనగర్లోని బైరమల్ గూడా చెరువును పరిశీలించి పరిసర కాలనీల ప్రజలను పరామర్శించారు. చెరువు ఉప్పొంగి తమ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని కాలనీ వాసులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్థానిక  ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు కార్పొరేటర్లు వారందరికీ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చెరువు నిండి హబ్సిగూడా వీధిలోని ఇళ్లలోకి వీధుల్లోకి పెద్ద ఎత్తున నీరు నిండడం తో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు మంత్రి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మరియు ఇతర అధికారులు మంత్రికి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించిన తర్వాత మంత్రి కేటీఆర్ హబ్సిగూడ రామంతపూర్ లోని కాలనీ లోని వాసులకు అండగా ఉండేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

ఆ తర్వాత మలక్ పేట లోని  అజంపుర, తీగల గూడా, ముసరాంబాగ్, మూస నగర్, శంకర్ నగర్ కాలనీలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే బలాల మంత్రి కేటీఆర్ కి అక్కడి పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తమ సమస్యలను తీసుకువచ్చారు. ప్రభుత్వం తక్షణ సహాయంగా వారందరికీ అవసరమైన ఆహారం, దుప్పట్లు, మరియు వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలంతా జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన సెంటర్లలో ఉండాలని సూచించారు. అక్కడ అంది ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వర్షం కొంత తెరిపి ఇచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైన అన్ని విషయాల్లో వారికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఆ తర్వాత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరియు పలువురు ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిసి పాతనగరంలోని పలు ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా లోని పలు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాతబస్తీ నుంచి వచ్చే మురికి నాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఆరంగర్ వద్ద కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించారు. వర్షం తగ్గిన తర్వాత రోడ్డు మరమ్మతులను పెద్ద ఎత్తున చేపట్టాలని జిహెచ్ఎంసి మరియు ఇతర ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కేటీఆర్ సూచించారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వీటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే విద్యుత్ సంస్థల అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకొని విద్యుత్ పునరుద్ధరణ వేగంగా పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ లు, జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఉన్నతాధికారులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలను నోట్ చేసుకొని తమ విభాగాల అధికారులకు ఎప్పటికప్పుడు వీరంతా పలు సూచనలు చేశారు.

- Advertisement -