ఇంటి నిర్మాణ అనుమతులు సులభతరంగా.. పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో మంజూరు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీ-పాస్ విధానాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. 600 గజాల లోపు ఇండ్లకు, 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారని….ఈ భవనాల నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు జారీచేస్తారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చామని…. తెలంగాణలోని 43 శాతం జనాభా పట్టణ ప్రాంతంలో ఉందన్నారు. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలు సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉందన్నారు. ఒకవైపు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన చేపడుతూనే మరోవైపు అధికార వికేంద్రీకరణ ద్వారా పౌరులకి మంచి సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. ఆమేరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రజలకు మేలు చేసే చట్టాలను ఏర్పాటు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చునని, ఈ స్పూర్తితోనే టీఎస్ బీ-పాస్ వంటి నూతన చట్టాలను తీసుకు వస్తున్నాం…. ఒక్క పైస ఇచ్చే అవకాశం, అవసరం లేకుండా… గతంలో నెలల సమయం పట్టే రిజిస్ట్రేషన్లు ఈరోజు అత్యంత పారదర్శకంగా ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ చట్టాలను, విధానాలను కేంద్ర ప్రభుత్వం తో పాటు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి….. టీఎస్ ఐ-పాస్ ద్వారా ఏ విధంగా అయితే విజయవంతంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే అద్భుతమైన సంస్కరణ చేపట్టినామో, అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణాల కోసం టీఎస్ బీ-పాస్ తీసుకువచ్చామన్నారు.
ఈ విధానంతో సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఇన్స్టెంట్గా అనుమతులు లభిస్తాయి… 75 గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతి వస్తుంది. 600 పైన 21 రోజుల్లో అనుమతి ఇస్తాం…లేకుంటే ,deemed approval ఐనట్టేనని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధ్రువీకరణలు, అబద్ధాలు, తప్పుడు ధ్రువీకరణ చేస్తే భవన నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.
ప్రభుత్వం ఎంత విశ్వాసంతో మీ అందరికీ స్వీయ దృవీకరణ అవకాశం ఇచ్చినదో అంతే విశ్వాసంతో ప్రజలంతా దీని అనుసరిస్తారని ఆశిస్తున్నాము … పట్టణాలు పెరుగుతున్న మేరకు క్రమబద్ధీకరణ, ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగకపోవడంతో మొన్న వచ్చిన వరదల వంటివి పదేపదే వస్తున్నాయన్నారు. అందుకే నూతన జిహెచ్ఎంసి చట్టంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం కొన్ని కఠినమైన నిబంధనలను చేర్చబోతున్నామని తెలిపారు.
ఇప్పటికే కొత్తగా మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ వంటి చట్టాలు తీసుకువచ్చాం… త్వరలో నూతన జిహెచ్ఎంసి చట్టాన్ని తీసుకురాబోతున్నాం..- టీడీ అర్ బ్యాంక్ ఏర్పాటు, ఏకీకృత సర్వీస్ రూల్స్ వంటివి తీసుకువచ్చాము. ఇవన్నీ ప్రజలందరికీ మెరుగైన పౌర సేవలు అందించడం కోసమే తీసుకురావడం జరిగిందన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీ-పాస్ చట్టం, విధానం దేశంలోనే అత్యుత్తమ భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియగా నిలువబోతుంది… రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరానికి ఉన్నంత ఉజ్వల భవిష్యత్తు ఏ ఇతర మెట్రో నగరానికి కూడా లేదన్నారు.ఇప్పటికే హైదరాబాద్ నగరాణికి అందుబాటు ధరల్లో ఇండ్లు ఉన్నాయి అన్న ఒక సానుకూలత హైదరాబాద్ నగరానికి ఉన్నది, ఈ సానుకూలతను అలాగే కొనసాగించాలని రియల్ ఎస్టేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.