దేశానికి సేవ చేయాల‌ని రాజకీయాల్లోకి: కేటీఆర్

38
ktr

తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌లోని దర్గా ఖలీజ్‌ఖాన్‌(కిస్మత్‌పూర్‌)లో ఉన్న ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, గుళ్లపల్లి ప్రతిభారావు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ ఐ కేర్‌లో ‘పూర్ణిమ-రామం’ ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ డా.గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… రాష్ట్రంలో ఎవరూ కంటి సంబంధిత సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు.

పుట్టి పెరిగిన దేశానికి ఏంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికి, ఇప్పటికే దేశంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ఇండియా దూసుకెళ్తోందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తోందని.. వికారాబాద్‌లోనూ సేవలను ప్రారంభిస్తే స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు.