డిసెంబరు నాటికి 85 వేల ఇళ్లు అందజేస్తాం- మంత్రి కేటీఆర్‌

139
ktr

ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని అన్నారు. సుమారు 9 వేల 700 కోట్ల రూపాయలతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్ద ఎత్తున జిహెచ్ఎంసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు జిహెచ్ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం పైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతోపాటు, జిహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇళ్ళ నిర్మాణ పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. చాల చోట్ల పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌళిక వసతుల పనులు వేగవంతం చేయాలన్నారు.

ఇప్పటికే డబుల్ బెడ్డ రూం ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నవని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుసగా పేదలకు వాటిని అందించే కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆగస్టు మాసాంతం నుంచి డిసెంబర్ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని వెంటవెంటనే పేద ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు. సుమారు 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు మరో పది వేలు జె ఎన్ఎన్ యు ఆర్ ఎం మరియు వాంబే ఇళ్లు ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు.

ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున 24 నియోజకవర్గాలకు లక్ష ఇళ్లు అందించే కార్యక్రమం ఉండబోతుందన్నారు. దీనికి సంబంధించిన లబ్దిదారుల క్యాచ్మెంట్ ఏరియా కూడా రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల ఇచ్చినటువంటి మురికివాడల్లోని ప్రజల (ఇన్ సిట్యూ )లబ్ధిదారుల జాబితాను వెంటనే అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిహెచ్ఎంసి పరిసర జిల్లాలో నిర్మిస్తున్న ప్రాంతాల్లో సుమారు 10% స్థానిక ప్రజల కోసం కేటాయించిన నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. జిహెచ్ఎంసి పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందులో సింహభాగాన్ని ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు.ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మెహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.