మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం జమ్మికుంట పట్టణంలోని ధర్మారంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి పార్టీ శ్రేణులు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. రెండు కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ముందుకు సాగుతుంటే, ప్రధాని మోడీ అందరిని నాశనం పట్టిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. టిఆర్ఎస్ అభివృద్ధిని నమ్ముకుంటే, బిజెపి దేశాన్నే అమ్మేస్తున్నదని వ్యాఖ్యానించారు. బిజెపి పేరుతో మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను ఇష్టారీతిన పెంచడంతో నిత్యావసరాలు కూడా మనం కొనే పరిస్థితుల్లో లేమన్నారు మంత్రి. కెసిఆర్ 24గంటలు కరెంటు ఇస్తుంటే, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని మోడీ కుట్ర చేస్తున్నారని కొప్పుల వివరించారు. ఇలాంటి విచ్ఛిన్నకర పార్టీ బిజెపిలో ఈటల చేరారని, అది ఎస్సీ, ఎస్టీ బీసీ, ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకమన్నారు. అలాంటి పార్టీకి, అందులో చేరిన నాయకుడికి మీరు మద్దతిస్తారా అని మంత్రి ప్రజలను అడుగగా.. లేదు లేదు అంటూ సభికులు బదులిచ్చారు. ప్రతినిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మేలు కాంక్షించే కెసిఆర్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా మంత్రి ప్రజలను కోరారు.
దళితబంధు పథకం అమలు పట్ల ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని, దళిత మహిళల అకౌంట్లలలో 10లక్షలు వేయడం తథ్యమన్నారు. ధర్మారంలో నెలకొన్న భూమి సమస్య గురించి దళితులు మంత్రి కొప్పుల దృష్టికి తేగా, వెంటనే స్పందించి తహశీల్దార్ ను పిలిపించి తగు ఆదేశాలిచ్చారు. స్థానికులు చప్పట్లు కొడుతూ జై తెలంగాణ జై జై కెసిఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, వైస్ ఛైర్మన్ స్వప్న, మాజీ ఛైర్మన్ రామస్వామి, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, రవీందర్,బుచ్చన్న,వీరన్న తదితరులు పాల్గొన్నారు.