శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంత్రి కొప్పుల రూ.8 కోట్ల అంచనా వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సాగుకు నిరంతర విద్యుత్ అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతున్నదన్నారు.రాష్ట్రంలో కోటి కుటుంబాల్లో నాలుగు కోట్ల జనాభా ఉంది. వీరిలో 60 లక్షలు రైతు కుటుంబాలే. రైతు పది వేళ్లు భూమిలో పనిచేస్తేనే మిగతా వారి అయిదు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయి. ప్రజల ఆకలి తీర్చేది రైతులైతే దేశాన్ని కాపాడేది సైనికులు. అందుకే వీరిద్దరిని కాపాడుకోవాలి’ అని మంత్రి అన్నారు.
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో 24 లక్షల బోరుబావుల కింద 50 లక్షల ఎకరాలు సాగులో ఉందని తెలిపారు. రైతులకు జీవనాధారం నీళ్లు, విద్యుత్ అని ఈ రెండింటిని ఉచితంగా అందించగలిగితే అన్నదాతలు చింత లేకుండా పుష్కలంగా పంటలు పండిస్తారని పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గ రైతులు చైతన్యవంతులని, సమయానుకూలంగా పంటలు సాగు చేసి అత్యధిక దిగుబడులు సాధిస్తున్నారని అభినందించారు.