మా బతుకులు బాగుపడొద్దని కుట్రలు చేస్తుండ్రు- మంత్రి కొప్పుల

127
- Advertisement -

ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా దళిత బంధు పథకం అమలవుతుందని,అమలు చేసి తీరుతమని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.ఈటల, బిజెపి, కాంగ్రెసు నాయకులు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నరని,ఇది అమలయితే తమకు కాలం చెల్లినట్లేనన్న భయంతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. దళితబంధు పథకం అమలుపై పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి స్థానికులతో ముచ్చటించారు. కేసీఆర్ మాట చెప్పిండంటే తప్పక కట్టుబడి ఉంటరు,ఆయనది ఉడుంపట్టు,పట్టుపట్టిండంటే విడిచి పెట్టరు, నూటికి నూరు పాళ్లు అమలు చేసి తీరుతారని వివరించారు. తమ అన్నంలో మన్ను పోయొద్దని, నోటికాడి అన్నంను సున్నం చేయొద్దని ప్రతిపక్షాలను మంత్రి కోరారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపలేదని, దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా ఉచితంగా 24గంటల కరెంటు సరఫరా,రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మీ, గురుకులాల వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ దళితబంధును ఒక పథకం మాదిరిగా కాకుండా ఉద్యమం వలె అమలు చేయడం తథ్యమని కొప్పుల స్పష్టం చేశారు.హూజూరాబాద్ నియోజకవర్గంలో మొదట మొదలు పెట్టి 20వేల కుటుంబాలకు 10లక్షల చొప్పున ఈ నెలాఖరు వరకు అక్కౌంట్లలో పడ్తాయన్నారు. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలొద్దు, అందరికి తప్పక అందుతాయని మంత్రి హామీనిచ్చారు. దీనికి సంబంధించి కేసీఆర్ 2 వేల కోట్లు కేటాయించారని, 500కోట్లు ఇప్పటికే విడుదల చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రారంభించిన దళిత బంధుకు ముందు రైతుబంధును ఈ గడ్డ మీదే మొదలు పెట్టామని కొప్పుల తెలిపారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కాదు, అసెంబ్లీ సాక్షిగా ఫిబ్రవరిలోనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించిన విషయాన్ని ఈటల, ప్రతిపక్షాలు గుర్తు చేసుకోవాలన్నారు.

ఇటువంటి చారిత్రాత్మక పథకాన్ని ఎక్కడ నుంచో ఒక చోట మొదలు పెట్టాల్సిందే కదా!..రైతుబంధు మొదలు పెట్టిన ఇక్కడ నుంచే దళితబంధు కూడా ప్రారంభించడం పట్ల హూజూరాబాద్ ప్రజలంతా సంతోషిస్తుంటే ఈటల ఒక్కరే వ్యతిరేకిస్తున్నారన్నారు.ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని గోధ్రాలో ఎస్సీలు, ముస్లింలను ఊచకోత కోసిన సంఘటనను మంత్రి గుర్తు చేశారు.ఇప్పుడు ఆ మోడీకి చెందిన పార్టీలో ఈ ఈటల చేరిండని ఈశ్వర్ పేర్కొన్నారు.దళితబంధును ఇక్కడ మొదలు పెట్టి రాష్ట్రమంతటా అమలు చేస్తామని,ఈ విషయంలో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి కొప్పుల మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -