జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వాడ 24వ వార్డులో జరిగిన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు కోటి, సుధాకర్, తిరుపతి,కిషన్,చందు,కిరణ్, రమేష్,సదానందం, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో జై తెలంగాణ, జై కెసిఆర్, జై టిఆర్ఎస్,గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు అనే నినాదాలు మిన్నంటాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరికి ఓటేయ్యాలి, ఎవరేం చేశారు, ఎందుకు ఓటేయ్యాలనే ఆలోచన చేయాలి అన్నారు. మనమందరం మొదటి నుంచి టిఆర్ఎస్ కు ఓటేస్తున్నం.. టిఆర్ఎస్ ను కెసిఆర్ స్థాపించారు..కెసిఆర్, టిఆర్ఎస్ నాయకత్వంలో మనమందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నం. పరాయి పాలన నుంచి విముక్తి చెందినం. ఆ విధంగా తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నం. మనసున్న ప్రభుత్వం, మనసున్న నాయకుడు పాలకుడిగా ఎంత మంచి జరుగుతుందో చూస్తున్నం అని మంత్రి తెలిపారు.
పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. 24 గంటల కరంటు ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నది ఒక తెలంగాణలోనే.. అలాగే గర్భిణీ మహిళలను ప్రసూతి సమయంలో ఆదుకునేందుకు కెసిఆర్ కిట్,అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నది తెలంగాణలో మాత్రమే అన్నారు. మనమంతా మొదటి నుంచి టిఆర్ఎస్ తోనే ఉన్నం.. మనల్ని ఈటల వదిలిపెట్టిండు. ఆయనను కెసిఆర్ ఆరు సార్లు ఎమ్మెల్యేను, రెండు సార్లు మంత్రిని చేసిండు, మెడికల్ కాలేజీ ఇచ్చిండు. ఉన్నంత కాలం గౌరవించిండు అని తెలిపారు.
అయితే పేదలకు అండగా ఉండాల్సిన ఈటల ఎస్సీ,బిసిల భూములు ఆక్రమించుకుండు..మస్తు సంపాదించిండు. రకారకాల తప్పులు చేసి మనల్ని కాదని వెళ్లి బీజేపీలోకి పోయిండు. అందుకే మనకు రక్షణ ఇచ్చే,మంచి చేసే వారిని మనం ఎన్నుకోవాలి. దళితబంధుపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. మీ ఖాతాల్లో పడ్డ డబ్బులను బ్రహ్మ దేవుడు కూడా వెనక్కి తీసుకోలేడు. బిజెపి వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంబంధిత మంత్రిగా చెబుతున్న,హామీనిస్తున్న ఎవరో తెలియని వాళ్లు చెప్పే మాటలు నమ్మకండి, మీ ఖాతాలో పడిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి పోవు అని స్పష్టం చేశారు.
బిజెపి వల్ల ఒరిగేదేమీ లేదు. బండి సంజయ్ ఎంపిగా గెలిచి చేసింది శూన్యం. రాజేందర్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ జమ్మికుంటలో మార్పు వచ్చింది. అప్పుడు రోడ్లు, డ్రైనేజీలను ఆయన పట్టించుకోలేదు. అందుకే అభివృద్ది పనులు అలస్యమైయ్యాయి.. కానీ ఇప్పుడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దళిత కుటుంబాలన్నింటికి 10లక్షల చొప్పున తప్పక వస్తాయి. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి అని మంత్రి కొప్పుల కోరారు.