క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి- మంత్రి కొప్పుల

33
koppula

క్రైస్తవుల భద్రతకు, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నగరంలోని రాంకోఠిలో అధునాతనంగా నిర్మించిన సెంటనరీ వెస్లీ చర్చిని శనివారం రాత్రి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్టియన్లు,చర్చిల భద్రతకు, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.

ఇప్పటి వరకు దీని నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు వెచ్చించామని,ఈ సువిశాలమైన చర్చిలో ఏక కాలంలో 10వేల మంది ప్రార్థనలు చేయొచ్చని రెవరెండ్ యు.డానియేల్ మంత్రికి వివరించారు.దీనిని పూర్తి చేయడానికి,మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని, నిధులు మంజూరు చేయవలసిందిగా ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కొప్పుల అత్యాధునికంగా నిర్మించిన ఈ చర్చి గురించి ముఖ్యమంత్రికి వివరించి నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని వారితో చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కలకాలం కొనసాగాలని, తెలంగాణ మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. మంత్రిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో క్రిస్టియన్ ప్రముఖులు ప్రభోద్,ప్రేంకుమార్,విద్యాస్రవంతి తదితరులు పాల్గొన్నారు.