మ‌రింత ప్ర‌గ‌తిప‌థంలో బీసీ గురుకులాలు..

344
Minister Koppula Eshwar
- Advertisement -

గురుకులాల ద్వారా సాగే విద్యాబోధ‌న ఉన్న‌తంగా ఉండాల‌నేది రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆశ‌య‌మ‌ని, ఈ నేప‌థ్యంలో అధికారులు, గురుకులాల సిబ్బంది త‌గు కృషి చేసి మ‌రింత ప్ర‌గ‌తిప‌థంలో బీసీ గురుకులాలను ముందుకు తీసుకుపోవాల‌ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కోరారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారుల‌తో ఆయన స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడకముందు కేవలం 19 స్కూల్స్ మాత్రమే ఉన్నాయని, తెలంగాణ వచ్చిన తరువాత 2016 -17 సంవత్సరంలో 19 జూనియర్ కాలేజీలు, 1 మహిళల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడమైనదని, అలాగే 4 పాఠశాలను ప్రారంభించామ‌ని తెలిపారు. 2017-18 సంవత్సరంలో సీఎం కేసీఆర్ కృషి వలన 119 పాఠశాలలు ప్రారంభించడం జరిగిందని వెల్ల‌డించారు. 2019-20 సంవత్సరంలో కూడా 119 పాఠశాలలు ప్రారంభిస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. మొత్తం 281 కాలేజీలు మరియు పాఠశాలలో ప్ర‌స్తుతం 92 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నార‌ని మంత్రి వెల్ల‌డించారు.

Minister Koppula Eshwar

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 6వేల మంది మాత్ర‌మే విద్యార్థులు ఉండేవార‌ని పేర్కొన్నారు.ప్ర‌స్తుతం విద్యా సంవ‌త్స‌రం నేప‌థ్యంలో  కొత్తగా ఏర్పాటు చేసిన 119 పాఠ‌శాల‌కు భవనాలు సిద్ధం చేయడమైందని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌కు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఎంపిక‌లో 5,6,7 త‌ర‌గ‌తుల యొక్క స్టూడెంట్ అడ్మిషన్ మొద‌టి లిస్ట్ పూర్తి అయిందని తెలిపారు. ప్రిన్సిపాల్స్ బాధ్య‌త‌ల విష‌యంలో పాత స్కూల్‌లో పని చేస్తున్న ప్రిన్సిపల్స్ కు కొత్త స్కూల్స్ అడిషనల్ చార్జెస్ ఇవ్వడమైనదని పేర్కొన్న అధికారులు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసే వ‌ర‌కు ఈ బాధ్య‌త‌లు కొన‌సాగుతాయని వెల్ల‌డించారు.

బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది గురించి వివ‌రిస్తూ.. కొత్త స్కూల్స్ కొరకు 3689 పోస్టులు మంజూరు చేయడం జరిగిందని, ఈ పోస్టులను వివిధ దశలలో 2019 -20 నుండి 2022- 23 వరకు భ‌ర్తీ చేస్తార‌ని తెలిపారు. అప్పటి వరకు పాత పాఠ‌శాల‌ల నుంచి ఇద్దరు టీచర్లును కొత్త పాఠ‌శాల‌ల‌కు నియామ‌కం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇంకా అవ‌స‌రం ఉన్న చోట ఔట్‌సోర్సింగ్ విధానంలో నియ‌మించుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. పీఈటీ మ‌రియు స్టాఫ్ న‌ర్సులు, బోధ‌నేత‌ర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునేలా జిల్లా క‌లెక్ట‌ర్లు ఆదేశాలు ఇచ్చామ‌ని అధికారులు వెల్ల‌డించారు. పాఠ‌శాల యొక్క మౌలిక స‌దుపాయాలు, ఆఫీసు, ఫ‌ర్నీచ‌ర్‌, గ్యాస్ సిలిండ‌ర్‌, చాక్ బోర్డ్స్ వంటివి అన్ని పాఠ‌శాల‌ల‌కు ఇప్ప‌టికే పంపిణీ చేశామ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌కు అధికారులు తెలిపారు.

98% పాఠ‌శాల‌ల‌కు నోటు పుస్త‌కాలు, పాఠ్య‌పుస్త‌కాల స‌ర‌ఫ‌రా పూర్తి అయిందని పేర్కొన్నారు. అన్ని పాఠ‌శాల‌ల‌ ప్రిన్సిపాల్ల‌కు రూ.2లక్షలు ప్రొవిజ‌న్స్‌ మంజూరు చేయడమైనదని అధికారులు పేర్కొన్నారు. అధికారుల వివ‌రాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ పాఠ్య‌పుస్త‌కాల స‌ర‌ఫ‌రా పెండింగ్‌లో ఉన్న మిగిలిన పాఠ‌శాల‌ల‌కు ఈ వారంలో వాటి స‌ర‌ఫ‌రా పూర్తి చేయాల‌ని అదేశించారు. గురుకులాల‌ను ఉత్త‌మ విద్యాలయాలుగా తీర్చిదిద్దాల‌ని, ఇందుకోసం అధికారులు నిత్యం శ్ర‌మించాల‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున వారికి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని పున‌రుద్ఘాటించారు.

క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువ‌చ్చి ప‌రిష్కరించుకోవాల‌ని.. త‌ద్వారా గురుకులాల‌ల‌ను మ‌రింత ప్ర‌గ‌తిప‌థంలో సాగేందుకు కృషి చేయాల‌ని మంత్రి తెలిపారు. కొత్త పాఠశాలల ప్రారంభ కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమము జరిగెటట్లు చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో బిసి మహాత్మా జ్యోతి పూలే గురుకులం సెక్రటరీ మల్లయ్య భట్, జాయింట్ సెక్రటరీ రమణ రెడ్డి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -