ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యార్థులకు మంత్రి కొప్పుల శుభాకాంక్షలు..

188
minister koppula
- Advertisement -

జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పోటీ పరీక్షలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ గురుకులాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు.ఎంబిబిఎస్,బిడిఎస్ కోర్సులలో ప్రవేశాలకై జాతీయ స్థాయిలో నీట్ పేరిట పోటీ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం విడుదల కాగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. ఎస్సీ గురుకులాల విద్యార్థులు 102 ఎంబిబిఎస్, 40 బిడిఎస్, ఎస్టీ గురుకులాలకు చెందిన వారు 30 ఎంబిబిఎస్,18 బిడిఎస్, మొత్తం 132 ఎంబిబిఎస్, 58 బిడిఎస్ సీట్లు దక్కించుకున్నారు.

గత విద్యా సంవత్సరంలో 74 ఎంబిబిఎస్,34 బిడిఎస్ సీట్లు మాత్రమే సాధించగా,ఈ ఏడాది ఈ గురుకులాలు మరింత మెరుగైన ఫలితాలు పొందాయి. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలో కృతకృత్యులైన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే,వీరిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, సిబ్బందిని ఒక ప్రకటనలో మంత్రి అభినందించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జరిగే విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలన్నింటితో పాటు క్రీడల్లో కూడా ప్రపంచ దేశాల్లోనూ పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిందిగా మంత్రి కొప్పులఈశ్వర్ ప్రవీణ్‌కు సలహానిచ్చారు.

- Advertisement -