పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అవలంభిస్తున్న రైతు వ్యతిరేక,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతాంగం చేపట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ వేలాది మంది రైతులు వెంట రాగా రాస్తారోకో కార్యక్రమాలలో పాల్గొన్నారు.జగిత్యాల జిల్లా వెల్గటూర్, ధర్మపురి మండలం రాయపట్నం చౌరస్తా తదితర చోట్ల మంత్రి కొప్పుల రాస్తారోకో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పులఈశ్వర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గత ఏడేండ్లుగా రైతాంగానికి ఎలాంటి మేలు చేయకపోగా, ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి తీవ్ర నష్టం చేస్తుండు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో, విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడంలో ఘోరంగా విఫలమైండు, రైతుకు మేలు జరిగే ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. రైతుకు ఏ మాత్రం మేలు చేయకపోగా,ఆదుకోకపోగా, నడ్డివిరిచే విధంగా 3 వ్యవసాయ బిల్లులను దొడ్డిదారిన తెచ్చి రైతుల బతుకులను వ్యాపారులు,మధ్య దళారుల చేతుల్లో పెట్టారని మంత్రి మండిపడ్డారు.
ఈ రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎండగట్టడం జరిగింది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతన్నలు ఇచ్చిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు పలికి, జాతీయ రహదారులను దిగ్బంధించి వారికి కొండంత అండగా నిలిచాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలను బిజెపి పాలిత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో ఆ పార్టీ పెద్దలు దేశ ప్రజలకు సమాధానమివ్వాలి. రైతుల భవిష్యత్తును అంధకారమయం చేసే ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి.వీటిని వెనక్కి తీసుకునే దాక విశ్రమించే ముచ్చటే లేదు, కెసిఆర్ నాయకత్వంలో రైతులతో పాటు ప్రజానీకాన్ని కూడగట్టి పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు మంత్రి కొప్పుల.