జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహాక సమావేశాలలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బిజీ బిజీ పాల్గొంటున్నారు. కరీంనగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ధర్మపురి నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ ముఖ్యులతో మంత్రి కొప్పుల సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన మంత్రి నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, మహోన్నత నాయకులు కెసిఆర్ అహింసా పద్ధతుల్లో మహోద్యమాన్ని నడిపి ప్రజల చిరకాల కోరిక అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.కెసిఆర్ “దీక్షా”దక్షతలు,త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఎన్నో కష్టనష్టాలు,ఆటుపోట్లు, చేదు అనుభవాలు చూశామన్నారు. కొన్ని సందర్భాలలో గతాన్ని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఇలాంటి సందర్భం మనకు మళ్లీమళ్లీ రాదని, మనమందరం అంకితభావంతో ముందుకు సాగతూ కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేద్దామన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దాం. 135 వ డివిజన్ వెంకటాపుర్‌లో మనమందరం కలిసికట్టుగా ప్రచారం చేద్దాం. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలను గురించి ప్రజలకు వివరిద్దామన్నారు మంత్రి. కెసిఆర్ సుపరిపాలన గురించి వివరిస్తూ, ప్రతిపక్షాల వైఫల్యాలను విడమర్చి ప్రజలకు చెప్పాలి. టిఆర్ఎస్, కెసిఆర్ లకు ప్రజల గుండెల్లో నెలకొన్న సుస్థిర స్థానం గురించి లోకానికి మరోసారి చాటి చెబుదామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.