క్రిస్మస్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల..

24

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రధానమైన వేడుకలు నగరంలోని ఎల్.బి.స్టేడియంలో మంగళవారం ( ఈరోజు) సాయంత్రం ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం అధికారికంగా జరిపే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. మంత్రి గంటకు పైగా స్టేడియం మొత్తం కలియ తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ, చిన్న చిన్న లోటుపాట్ల గురించి అధికారులకు పలు సూచనలు,సలహాలిచ్చారు. ప్రధాన స్టేజీ, వంటశాల,భోజనశాల, లైటింగ్, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను మంత్రి కొప్పుల పరిశీలించారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్,ఎమ్మెల్యే స్టీవెన్ సన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, క్రిస్టియన్ ఆర్థిక సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ, సెలబ్రేషన్స్ కమిటీ సభ్యులు రాయడిన్ రోచ్ ,రాజీవ్ సాగర్ ,శంకర్ లూక్ తదితరులు ఉన్నారు.