బీజేపీ నేతలపై మంత్రి కొప్పుల ఆగ్రహం..

46
minister koppula eshwar

బీజేపీ తెలంగాణ రాష్ర్ట వ్య‌వ‌హారాల ఇంఛార్జి త‌రుణ్ ఛుగ్‌పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. 2023లో అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ నేతలు అనుకోవ‌డం ప‌గ‌టి క‌లే అని విమ‌ర్శించారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌నిలో రామ‌గుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌తో క‌లిసి మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ,దుబ్బాక ఎన్నికల్లో కొద్దిగా ఓట్లు వచ్చినంత మాత్రాన విర్రవీగొద్దు అని మంత్రి ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికి టీఆర్ఎస్ దే. ఎన్నో పోరాటాలతో రాష్ట్రం సాధించుకుని దేశం లోనే నంబర్ వన్ రాష్ట్రం గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలబెడుతున్నారు. అలాంటి రాష్ట్రంను మీ చేతుల్లో పెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి విమర్శించారు.

మతాలను రెచ్చగొట్టడం తప్పితే మీ ముఖాలకు అభివృద్ధి అనేది తెలుసా?.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరదల్లో సాయం అందిస్తా అన్న బండి సంజయ్ ముందుగా మీ కేంద్రం నుంచి సాయం అందించి మాట్లాడు. నిరంతర సాగునీరు.. నిరంతర కరెంట్.. నిరంతర అభివృద్ధిని అడ్డుకోవడం మీ వల్ల కాదు. 17 లక్షల కోట్లు నల్లధనం వెలికి తీస్తామని పెద్ద నోట్లు రద్దు చేసి మీ మోడీ ఏం సాధించాడని మంత్రి ప్రశ్నించారు. దేశభక్తి పేరుతో ప్రజలను రెచ్చగొట్టకండి అని మంత్రి హితవు పలికారు.