దళితబంధు వంటి మహత్తరమైన పథకం తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీల జీవితాలలో వెలుగులు నింపే ఇలాంటి గొప్ప పథకాన్ని దేశం మొత్తం అమలు చేయాలన్నారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ: దళితబంధు వంటి మహత్తరమైన పథకం ఒక తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కూడా లేదన్నారు. ఎస్సీల జీవితాలలో వెలుగులు నింపే ఇటువంటి గొప్ప పథకాన్ని దేశం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలో ఇలాంటి విప్లవాత్మకమైన పథకాన్ని దమ్ముంటే వెంటనే ప్రవేశపెట్టాలని ఆ పార్టీల జాతీయ నాయకత్వాలకు మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయులు అంబేడ్కర్ చూపిన బాటలో నడుస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, సముద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరు. అభివృద్ధి, సంక్షేమంలో తెలగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది, దిక్సూచిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఈబీసీల సంక్షేమానికి, ఉన్నతికి తెలంగాణలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయని మంత్రి తెలిపారు.
ఈ విధంగా బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలో ఎందుకు ప్రవేశపెట్టరు,అమలెందుకు చేయరని ఆ పార్టీలను నిలదీస్తామన్నారు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి,ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రసాదించి, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆర్టికల్ 3 ద్వారా దారి చూపిన మహాత్ముడు అంబేడ్కర్. ఆ విధంగా ఏర్పడిన తెలంగాణ సమాజం ఆ మహనీయుడిని గొప్పగా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో 125అడుగుల కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నరు. పీఠంతో కలిపి ఈ విగ్రహం మొత్తం 180అడుగులు ఉంటుంది, అంబేడ్కర్ విగ్రహాలలో ప్రపంచం మొత్తంలో ఇదే అతిపెద్దది.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల కేక్ కట్ చేసి పలువురికి పంచి పెట్టి, అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రల గురించి వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన పలువురు బాలబాలికలకు నగదు బహుమతులు అందజేసి, అభినందించారు, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ ఫోటో గ్యాలరీని మంత్రి కొప్పుల సందర్శించి, దాని నిర్వాహాకులైన ఎస్సీ ఉద్యోగులను అభినందించారు.