రైతులకు 24 గంటల ఉచిత కరంటు విషయంలో చర్చ ఎందుకు తెచ్చారు ? ఎవరు తెచ్చారు ?అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. బీఆర్ఎస్‌ఎల్పీలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి..వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు, ఇండ్లకు 24 గంటల కరంటు ఉండొచ్చు .. మరి రైతాంగానికి కరంటు సరఫరా విషయంలో ఎందుకు చర్చ ? అని ప్రశ్నించారు. రైతాంగం, ప్రజలు ఈ విషయంలో ఆలోచించి వారి కుట్రలను అర్ధం చేసుకోవాలి…తొందరపాటుతో చంద్రబాబును బయటపడేసిన వ్యక్తి నేడు కరంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతరంగాన్ని బయటపెట్టాడన్నారు.
అందరి మాదిరిగానే రైతులకు 24 గంటల కరంటు అందుబాటులో ఉంచాలన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. రాత్రి 3 గంటలు, ఉదయం 3 గంటలు అంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. గతంలో రాత్రి పూట కరంటుతో పాముకాటు వంటి ప్రమాదాలకు గురై రైతులు మరణించారు .. అందుకే 24 గంటల కరంటు ఇవ్వడం జరుగుతుందన్నారు.
Also Read:విండీస్‌పై భారత్ గెలుపు
రైతులకు 24 గంటల కరంటు ఇస్తామని ఏ కాంగ్రెస్ నాయకుడు అయినా చెప్పిన దాఖలాలు ఉన్నాయా ? 9 గంటలు ఇస్తామని ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ధర్నాలు చేసిన సంఘటనలు కోకొల్లలు అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కరంటు కోసం ఎన్ని ధర్నాలు, ఎన్ని రాస్తారాకోలు ప్రజలకు తెలియదా ? ఏకంగా పారిశ్రామికవేత్తలే ధర్నా చేశారని గుర్తుచేశారు.రైతాంగాన్ని చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే .. పారిశ్రామికవేత్తలే పారీపోయేలా చేసిన పేటెంట్ మీదే .. అవినీతితో చరిత్ర మూటగట్టుకున్న పేటెంట్ మీదే అన్నారు. దొరికిపోయిన దొంగ తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుందని…జాతీయ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 24 గంటల ఉచిత కరంటు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అబద్దాలు చెప్పి, భూతులు మాట్లాడి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని…50 లక్షల నుండి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి చేరుకున్నది అంటే అది కేసీఆర్ ఘనత అన్నారు. తెలంగాణ వ్యవసాయం అంటేనే కరంటు .. గత యాసంగిలో 40 లక్షల ఎకరాలు బోరుబావులు, ఎత్తిపోతల పథకాల కిందనే సాగయ్యాయన్నారు. కాంగ్రెస్ దరిద్రపు విధానాల మూలంగా రైతు అనేక కష్టాలు అనుభవించారు…ఆహారం పండించి పస్తులుంటున్న రైతుకు చేయూతనివ్వాలని సంకల్పించి కేసీఆర్ ఉచిత కరంటు అమలు చేస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు చేసిన తప్పుడు వ్యాఖ్యలను మరికొందరు పార్టీ నేతలు సమర్ధించడాన్ని ప్రజలు, రైతులు గమనించాలన్నారు.
Also Read:చిక్కుల్లో మెగాహీరో సాయిధరమ్!
రేవంత్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తే దురుసుగా, అగౌరవంగా మాట్లాడుతున్నారు…కరంటు కొనుగోలు విషయం పారదర్శకంగా ఉంటే దాని మీద బురదజల్లడం రేవంత్ అవివేకానికి నిదర్శనం అన్నారు. కరంటు ఉద్యమంపై కేసీఆర్ మీద నిందలు వేయడం దుర్మార్గం అని…12 లక్షల వ్యవసాయ మోటార్ కనెక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చాయన్నారు.