మొక్కలు నాటడంపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చొరవ చూపితే ప్రజలను భాగస్వామ్యం చెయ్యడం కష్ట సాధ్యం కాబోదని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా అడవుల శాతాన్ని పెంపొందించేందుకు సులభమౌతుందని ఆయన చెప్పారు. చెట్ల పెంపకం ప్రాధాన్యతను మొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరవవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధితో పాటు మిర్యాలగూడ మండలం దూద్ బాయి తండాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. అందులో భాగంగానే హరితహారం పేరుతో గడిచిన ఆరు ఏండ్లుగా చైతన్యం తీసుకొచ్చి మొక్కల పెంపకంలో పోటీపడేలా చేసిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.పర్యావరణ సమస్య ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపధ్యంలో అడవుల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సత్ఫాలితాలు సాదించిందన్నారు. మొదటి విడత హరితహారం లో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్క నాటి ప్రారంభించిన హరితహారం తోటే ఇప్పుడు ఆ జాతీయ రహదారిపై హరితశోభ వర్ధిల్లుతోందని చెప్పారు.

పర్యావరణ సమస్యను అధిగమించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. మానవ జాతి ఎదుర్కొంటున్న అతి పెద్దసమస్యల్లో పర్యావరణం అతి ముఖ్యమైనదన్నారు. వాతావరణం లో మార్పులు జరిగి వాయి కాలుష్యంతో ప్రాణాంతక మైన వ్యాధులు ప్రబలడం కూడా అందులో ఒక బాగామేనని ఆయన చెప్పారు. వాటన్నింటికి కారణం వర్షాలు పడక పోవడమేనని అందుకు అడవులు అంతరించి పోవడమేనన్నారు. అటువంటి అడవుల పెంపకంపై దృష్టి సారించి మొక్కలపెంపకం ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు యన్. భాస్కర్ రావు,జడ్పిటిసి తిప్పన విజయసింహ రెడ్డి,రైతుబందు జిల్లా కన్వీనర్ రామచంద్ర నాయక్,మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ టిఆర్‌యస్ నేత నామిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

