మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. ఇది కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం వచ్చిందని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని అమ్ముకున్నారని మండిపడ్డారు. కేవలం తన కాంట్రాక్ట్‌ల కోసం ప్రజలు ఇచ్చిన పదవిని వదులుకున్నారు. తెలంగాణలో బహిరంగంగా అమ్ముడు పోయి ప్రజలకు దొరికిపోయిన దొంగ రాజగోపాల్ అని స్పష్టం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేయడంలో రాజగోపాల్ ఆరితేరాడని అన్నారు. తెలంగాణ కోసం మేము త్యాగాలు చేస్తే…పొరాట సమయంలో దొంగ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలు అభివృద్ది చేసే వాళ్లకోసం మాత్రమే ఓట్లు వేస్తారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. పైసలు పెట్టి ఓట్లు కొని ఎమ్మెల్యే అవుదామని కలలుగంటున్నావు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు. నీ లాంటి వాళ్ల మాటల గారడీలో పడరని గుర్తుఉంచుకో అని స్పష్టం చేశారు. నిరంతరం తెలంగాణ ప్రజల కోసం పనిచేసే టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ప్రజలు పట్టం కడతరాని తెలిపారు.
రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి బీజేపీకి కోవర్టుగా మారి కాంగ్రెస్‌ను మోసం చేశాడని మండిపడ్డారు. మాకు కాంగ్రెస్ పోటిదారుడు కానీ బీజేపీ ఎంత మాత్రం కాదని వివరించారు. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 12వేల ఓట్లు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని వీడి మూడు తోకలు ఉన్న పార్టీలో చేరి మునుగోడు ప్రజలను మోసం చేస్తున్నావని మండిపడ్డారు.
మునుగోడు అభివృద్ది కోసం ఏనాడైన జిల్లా మంత్రిని కలిసి నియోజకవర్గం సమస్యలను దృష్టికి తెచ్చావ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న మూడున్నర ఏళ్లలో అభివృద్ది కోసం ఏనాడు పాటు పడని వ్యక్తి… ఉప ఎన్నిక రాగానే అభివృద్ది మంత్రం జపిస్తున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధించనట్టే… మునుగోడులో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోరు ధర్మం వైపే ప్రజలు ఉంటారని అన్నారు.
బీజేపీ నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వస్తే తప్పులేదు కానీ మేము రాష్ట్ర మంత్రులు వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు తెరాస వైపు ఉంటారని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.