కార్పోరేట్‌కు ధీటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యతోటే జీవితాల్లో వెలుగులు నింపొచ్చని ఆయన చెప్పారు. విద్యను పెట్టుబడిగా పెడితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని నిరూపించిన మహానేత బాబసాహెబ్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం భోనగిరి యాదాద్రి జిల్లా భోనగిరి నియోజకవర్గ పరిధిలోని భోనగిరి మండలం తుక్కుపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పాఠశాలను తరగతి గదులను పరిశీలించిన ఆయన మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దళితులు, గిరిజనులు,బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీలకు ఉన్నత విద్యను అందించేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 1000 పైగా గురుకులాలు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకు భారత రాజ్యాంగ నిర్మాత బాబసాహెబ్ అంబెడ్కర్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ని గురుకులాలు నెలకొల్పిన రాష్ట్రంగా యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందన్నారు. అంతే గాకుండా ఆర్థిక భారం ఇతరత్రా కారణాలతో ఇంటర్ పైన విద్యకు స్వస్తి చెప్పే మహిళల డ్రాపౌట్స్‌ను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 33 మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. వైశాల్యం, జనాభాలో తెలంగాణ రాష్ట్రానికి మించి మూడింతలు ఉన్న రాష్ట్రాలలోను ఇన్ని గురుకులాలు, మహిళా డిగ్రీ కళాశాలలు లేవని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
నాగరికతకు అక్షరాస్యత కొలమనమన్నారు.అటువంటి నాగరిక సమాజ నిర్మాణానికి విద్య అవసరమని గుర్తించిన మీదటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రవైట్ విద్యను అందుకోలేని వారికి కార్పోరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తెచ్చారని ఆయన కొనియాడారు. అటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. భోనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి శాసనమండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.