24 గంటల నిరంతర జనతా కర్ఫ్యూ అనంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 1897 చట్టం కింద ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపద్యంలో సోమవారం ఉదయం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనీ నల్గొండ,సూర్యపేటలతో పాటు యాదాద్రి జిల్లాల కలెక్టర్లు,యస్.పి లతో ఉమ్మడి జిల్లాలో పరిస్థితులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్షించారు. అనంతరం లాక్ డౌన్ అమలులో అనుసరించాల్సిన పద్దతులపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మహమ్మారిలా విస్తరిస్తున్న కరోనాను కంట్రోల్ చెయ్యడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. మానవాళి మనుగడ కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిత్యావసర సరుకులు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యను అరికట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు అని మంత్రి అన్నారు.
అప్రమత్తంగా ఉండక పోతే అనర్దాలు చవిచూడాల్సి ఉంటుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున ప్రజలు విధిగా సహకరించాలి. చట్టం ఉల్లంఘన అనేది ఏ ఒక్కరికి మినహాయింపు కాదు. నిబంధనలు ఉల్లంఘన జరిగితే పరిస్థితులు చెయ్యి దాటి పోయే ప్రమాదం ఉంది. స్వీయనియంత్రణ తోటే వైరస్ ను అరికట్టొచ్చు. ఏ నిర్ణయం తీసుకున్న ప్రజల ఆరోగ్యభద్రత కొరకే అన్నది గుర్తించాలి. కనబడని వైరస్ సృష్టించిన అల్లకల్లోలం ప్రజలకు తెలియంది కాదు. తమంతట తామే లాక్ డౌన్ విజయవంతం చేయడానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.