అబ్దుల్లాపూర్ మెట్ తహశిల్దార్ విజయారెడ్డిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేయడంపై రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పాశవిక చర్య గా ఆయన పేర్కొన్నారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ .. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
అలాగే ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం అత్యంత దారుణమైన చర్య అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన తెలిపారు. ఈ ఘటన పట్ల వినోద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్‌లపై భౌతిక దాడులు జరగడం దుర్మార్గపు చర్య అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. విజయా రెడ్డి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు