తెలంగాణలో అలజడికి బిజెపి కుట్రలు పన్నుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ నాయకత్వం లోని కేంద్ర మంత్రులు ఇందుకు వ్యూహరచన చేసారని ఆయన చెప్పారు. ఆకలి విషయాలు అసలు విషయాలు పక్కన పెట్టి,దైనందిన కార్యక్రమాలను విస్మరించిన బిజెపి నేతలు మందిర్,మసీదుల పేర ప్రజల్లో చిచ్చు రగిల్చేందుకు పధకం రూపొందించుకున్నారని ఆయన తెలిపారు. సోమవారం నాల్గవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సూర్యపేట పట్నంలోని 31,21,07,22, వార్డులలో సిసిరోడ్లు,డ్రెనేజి నిర్మాణాలకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.22వ వార్డులోని ఆకుల బజార్ లో నూతనంగా నిర్మించిన క్షమ్యూనిటీ హాల్ ను ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వార్డులలో,పట్టణాలలో,గ్రామాలలో అవసరమైన మౌళిక సదుపాయాలపై ఆయా ప్రాంత ప్రజలు చర్చించుకుని మరి పల్లె ప్రగతి,పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా సాదించుకుంటున్నారన్నారు.దూరదృష్టి తోటే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలకు అంకురార్పణ చుట్టారన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరులో ప్రజల భాగస్వామ్యం ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.అభివృద్ధిలో పల్లెలు,పట్టణాలు పోటీ పడుతూ దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణా మారుతుంటే చూస్తూ తట్టుకోలేకనే కమలనాథులు కుట్రలకు తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంలో ఎనిమిదేండ్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.
శ్రీలంకలా మారింది గుజరాత్,ఉత్తరప్రదేశ్ లేనని మంత్రి పేర్కొన్నారు.మోడీ పాలన మరింత కాలం కొనసాగితే సోమాలియా పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.అమిత్ షా వ్యాఖ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు.ఆకలితో అలమటించే పాకిస్థాన్,బంగ్లాదేశ్‌ల పక్కన భారతదేశాన్ని మోడీ నిలబెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.రైతుబంధు, రైతు భీమా పథకాలు బిజెపికి నచ్చడం లేదన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాలలో అడుగుతారనే భయం వారిని వెంటాడుతుందన్నారు. అందుకే 29వ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన నవజాత శిశువు తెలంగాణను గొంతు నులిమెందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.అటువంటి పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ నుండే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ బిజెపికి ఆదరణ అంతంత మాత్రమే నని హస్తినలో గద్దె దింపేందుకు ప్రజలు సన్నద్ధం కావాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.