నిర్ణీత గడువులో సెక్రటేరియట్ పూర్తి కావాలి- మంత్రి వేముల

122
minister vemula
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాలమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగారు.వర్క్ చార్ట్ ప్రకారం పనుల పురోగతిని పరిశీలించి,నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణీత గడువులో సెక్రటేరియట్ పూర్తి కావాలని, దాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఏజన్సీ,ఆర్ అండ్ బి అధికారులు ఇలాగే సమన్వయంతో పనిచేస్తూ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

ఆదర్శ కట్టడంగా నిలువనున్న ఈ నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత నివ్వాలని అన్నారు.ఇప్పటికే నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారం బ్లాక్ మరియు ఫ్లోర్ వైస్ మెటీరియల్ ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమయం వృధా కాకుండా ఖచ్చిత ప్రణాళిక ప్రకారం పనులు జరగాలని వర్క్ ఏజన్సీని,ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి విధించిన గడువులో ఇంకా 10 నెలల సమయమే ఉన్నదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. ఈ చరిత్రాత్మక నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు మనసుపెట్టి పనిచేయాలని చెప్పారు.ఈ సందర్భంగా ఫ్లోర్ వైస్ కిటికీలు,మెయిన్ డోర్స్ డిజైన్ మంత్రి ఫైనలైజ్ చేశారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి,ఎస్.ఈ లు సత్యనారాయణ,లింగారెడ్డి,ఈ.ఈ శశిధర్,ఆర్కిటెక్ట్ ఆస్కార్ మరియు వర్క్ ఏజన్సీ షాపూర్ జి సంస్థ ప్రతినిధులు పలువురు ఉన్నారు.

- Advertisement -