ఈ నెల 25 న ప్రారంభం కానున్న ఆరవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేయాలని సహచర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఆయన ఈ విషయమై మంగళవారం ప్రజాప్రతినిదులకు లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలు చేయడం మనకు గర్వకారణం. ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన కార్యక్రమం తెలంగాణకు హరితహారం. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటు అయిన తొలినాళ్లలోనే హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణకు హరితహారం పేరిట ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నానికి ఐదేండ్ల కిందట సీఎం కేసీఆర్ బీజం వేశారు. రాష్ట్రంలో 24 శాతమున్న అటవీ శాతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 182 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
ముఖ్యమంత్రి దూరదృష్టికి, ప్రణాళికకు అనుగుణంగా అందరి సహకారంతో గత ఐదేళ్లుగా రాష్ట్రంలో హరిత హారం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో హరిత హారంలో నాటిన మొక్కలు పెరిగి నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జంగిల్ బచావో, జంగిల్ బడావో (ఉన్న అడవిని కాపాడాలి, పోయిన అడవిని పునరుద్ధరించాలి) అని సీయం కేసీఆర్ ఇచ్చిన నినాద స్పూర్తితో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో మమేకమై మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.హరితహారం కార్యక్రమంతో పాటు సీయం కెసిఆర్ గారి మార్గనిర్ధేశనంలో రాష్ట్రం ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.
నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని చట్టంలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. పచ్చదనం – పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను కూడా సమకూర్చారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సీయం గారు మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చుడతారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ శాసన సభ్యులు మీ నియోజకవర్గ పరిధిలో పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. నాటిన మొక్కలను సంరక్షించేలా చూడాలని కోరుతున్నాను.