నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. జీయన్ఆర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న మంత్రి వారిని ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆరా తీశారు. వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం కారణంగా సాధారణ ప్రజలతో పాటు రైతులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
స్వర్ణ ప్రాజెక్ట్ లోకి ఊహించని విధంగా వరద నీరు రావడంతో గేట్లు ఎత్తివేశారని, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేయడంతో వరద తగ్గుముఖం పట్టిందన్నారు. అధికారులు, సిబ్బంది నిన్నటి నుంచే సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండి, సహాయం చేస్తామని వెల్లడించారు. మంత్రి వెంట ఐజీ నాగిరెడ్డి,జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తదితరులు ఉన్నారు.