హారితహార లక్ష్యాన్ని అధిగమించాం- మంత్రి అల్లోల

221
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి దేశీయ, అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహార కార్యక్రమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచే ఉద్భవించిన మరో మానస పుత్రిక హరితహార కార్యక్రమమని అన్నారు. హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించు కోగా, లక్ష్యాన్ని అధిగమించి 239 కోట్ల మొక్కలు నాటమని తెలిపారు. హరితహార కార్యక్రమానికి ఇప్పటివరకు రూ. 6555.97 కోట్లు వెచ్చించామన్నారు.

హరితహార కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రమంతా 3.67 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు. ఇదే ప్రణాళికతో ముందుకుసాగుతూ.. 33% శాతం అటవీకరణ సాధిస్తామని తెలిపారు.అడవులు,పల్లెల్లో,పట్టణాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనపడుతుందని, అటవీ శాఖ మంత్రిగా తాను వ్యక్తిగతంగా ఎంతో గర్వపడుతున్నాను అని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజల్లో పర్యావరణం, ఆరోగ్యం అవగాహన పెరగడంతో మొక్కల నాటాలనే స్పృహ వచ్చిందని చెప్పారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్ కోసం అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేసి,చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రజలు, విద్యార్థుల్లో హరితహార కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అడవుల పరిరక్షణకు అటవీ అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిజ ప్రాధాన్యతను ఇస్తున్నామని, గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి హరితహార భావజాల వ్యాప్తికి తనవంతు కృషి చేస్తున్నారని అభినందించారు. సెలబ్రిటీలను, వివిధ రంగాల ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారని ఆయనను ప్రశంసించారు.

హరితహార కార్యక్రమం వల్ల రాష్ట్రమంతా పచ్చదనం పెరిగిందని చెప్పుతూ.. సభలో… నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్, గజ్వేల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అటవీ పునరుద్ధరణతో పెరిగిన పచ్చదనం, గజ్వేల్ పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన సంగాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, నిర్మల్ గండిరామన్న హరిత వనం, మహబూబ్ నగర్‌లో కేసీఆర్ ఎకో టూరిజం పార్క్, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్, నిర్మల్ గండి రామన్న హరిత వనం, నిర్మల్ సమీపంలోని చించోలి గాంధారి వనం, సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారికి ఇరువైపులా పెరిగిన పచ్చదనంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతలో దేశానికే ఆదర్శంగా నిలిచిన నిర్మల్ జిల్లా తానుర్ మండలం ఉమ్రి, అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా- కె గ్రామాల ఫోటోలను ప్రదర్శించారు.

- Advertisement -