నిరంత‌ర ప్ర‌క్రియ‌గా హ‌రిత హారం- ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

249
indrakaran reddy
- Advertisement -

పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన, ఆరోగ్యకరమైన తెలంగాణగా మార్చుకునేందుకు అటవీ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రియతమ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆలోచనలు, ఆదేశాల మేరకు మా శాఖ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తోంది. ఆకు పచ్చని తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా జంగల్ బచావో- జంగల్ బడావో నినాదాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా అటవీ శాఖ ద్వారా సరికొత్త కార్యక్రమాలను చేపట్టి ముందుకు వెళ్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతం 27,402.98 (ఇరవై ఏడు వేలా నాలుగు వందల రెండు పాయింట్ తొమ్మిది, ఎనిమిది) చదరపు కిలో మీటర్లు ఉన్నది. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో 24 శాతంగా అటవీ ప్రాంతం ఉంది. ఇందులో 12 రక్షిత ప్రాంతాలు, 3 జాతీయ పార్కులు, 2 టైగర్ రిజర్వులు, 7 అభయారణ్యాలు ఉన్నాయి. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం రాష్ట్ర భూభాగంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ప్రస్తుతం ఉన్న 24 నుంచి 33 శాతానికి పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన అటవీ, పర్యావరణాలను మళ్లీ పునరుద్దరించుకునేందుకు యుద్దప్రాతిపదికన అటవీ శాఖ పనిచేస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ, ఏ ముఖ్యమంత్రీ ఇవ్వని ప్రాధాన్యత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నేతృత్వంలో అడవులకు ఇస్తోంది.

జంగల్ బచావో –జంగల్ బడావో నినాదం కింద ఉన్న అటవీ ప్రాంతాన్ని రక్షించుకోవటం, కొత్తగా పచ్చదనాన్ని పెంచుకోవాలనే దిశగా అటవీ శాఖ పనిచేస్తోంది. అటవీ భూములను రక్షించుకోవటంతో పాటు, విలువైన అటవీ సంపదను కాపాడేందుకు అనేక కొత్త నిర్ణయాలను తీసుకున్నాం. అటవీ నేరస్థులను అదుపులో పెట్టేందుకు పీడీ యాక్టును ప్రయోగిస్తున్నాం. చెక్ పోస్టులను బలోపేతం చేశాము. పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో నిరంతర తనిఖీలు చేస్తున్నాం.

కొన్ని అటవీ నేరాలను నాన్ బెయిలబుల్ చేయటం, అటవీ వన్యప్రాణుల నేరాలను తగ్గించేందుకు సవరణల ద్వారా అటవీ చట్టం, మరియు నిబంధనలను మరింత కఠినతరం చేసి, పటిష్టపరచాలని ప్రతిపాదించటమైనది.

అటవీ శాఖ బలోపేతం కోసం తీసుకున్న చర్యలు :

అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది పనితీరును బలోపేతం చేసేందుకు 2173 కొత్త వాహనాలను సమకూర్చాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వరకు 2008 మోటారు సైకిళ్లు ఇచ్చాం. అటవీ క్షేత్ర అధికారులకు వంద జీపులు, అటవీ మండలాధికారులకు 28 వాహనాలు అందజేశాం.

గతంలో ఏన్నడూ లేని విధంగా అటవీ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టాము. మొత్తం 2013 కొత్త ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇందులో 90 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 66 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లుగా నియమించాం. దీంతో అటవీ శాఖ క్షేత్ర స్థాయిలో బలోపేతం అయింది. పోలీస్ శాఖ తర్వాత అత్యధిక సిబ్బంది కలిగినది అటవీ శాఖ మాత్రమే.

అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు :

తెలంగాణకు హరితహారం : ప్రస్తుతం ఉన్న గ్రీన్ కవర్ ను 24 నుంచి 33 శాతం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. దీనికి అనుగుణంగా ఏటా వర్షాకాలం మొదలు కావటంతోనే పండగ వాతావరణంలో హరితహారం ద్వారా కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదో విడతకు చేరుకున్న హరితహారం ద్వారా ఇప్పటిదాకా అడవుల లోపలా, బయట ప్రాంతాల్లో కలిపి 175 కోట్ల మొక్కలు నాటాము.

గత నాలుగేళ్లుగా నాటిన మొక్కలు వివిధ ప్రాంతాల్లో పెరిగి పెద్దవై మనకు అహ్లాదాన్ని పంచుతున్నాయి. రహదారులకు ఇరువైపులా 7, 409 కిలో మీటర్ల పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ ను పెంచుతున్నాము. ఏపుగా పెరుగుతున్న ఈ చెట్లు ఆ మార్గాల్లో ప్రయాణం చేసే వారికి చక్కని అహ్లాదాన్ని పంచుతున్నాయి. తెలంగాణకు హరితహారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు వచ్చి మనం ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు.

హరితహారం ఒక నిరంతర ప్రక్రియ, పచ్చదనం పెంచాలన్న ఈ సదుద్దేశ్యంలో అందరినీ భాగంగా చేస్తున్నాం. కొత్త పంచాయితీ రాజ్ చట్టం ద్వారా గ్రామ స్థాయిలో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నాం. నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చర్యలను తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ముఫ్పై రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామ గ్రామాన కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధులుగా మనందరం, మన నియోజకవర్గాల్లో అన్ని వర్గాలను ఈ మహాకార్యంలో భాగస్వామ్యం చేయటం ద్వారా లక్ష్యాన్ని చేరుకుని ఆకు పచ్చ తెలంగాణ కల సాకారం చేసుకుందాం.

పట్టణ ప్రాంత అటవీ పార్కులు :

తెలంగాణకు హరితహారం ద్వారా చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం పట్టణ అటవీ పార్కుల ఏర్పాటు. పచ్చదనం కనుమరుగు అవుతుండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో స్వచ్చమైన గాలి దొరకక, ఆక్సీజన్ ను మార్కెట్లలో కొనుక్కునే దుస్థితి మెట్రో నగరాల్లో వస్తోంది. మనకు ఆ పరిస్థితి రావొద్దనే, దూరదృష్టితో పట్టణ ప్రాంతాల్లో ఉండే కాలుష్యం, నిత్య జీవితంలోని ఒత్తిడులను తట్టుకుని, అహ్లాదకరమైన ప్రాంతంలో నిత్యం వాకింగ్, యోగా లాంటి కార్యక్రమాలతో పాటు వారాంతాల్లో కుటుంబంతో సహా సేదతీరేలా అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతున్నాము.

పట్టణ ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండే అటవీ ప్రాంతాలకు రక్షిత చర్యలు చేపట్టడంతో పాటు, దానిలో కొద్ది ప్రాంతంలో పార్కులను ఏర్పాటు చేస్తున్నాము. మొదటి దశలో మొత్తం 77 పార్కులకు గాను, ఇప్పటిదాకా 31 పార్కులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము. దశల వారీగా అన్ని పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఒక్కో పార్కును ఏర్పాటుచేయాలనే సంకల్పంతో ఉన్నాము.

కంపా నిధులు, పనులు :

ప్రత్యామ్నాయ అటవీ పెంపకం నిధి నిర్వహణ, ప్రణాళిక ఆథారిటీ (Compensatory Afforestation Fund Management and Planning Authority) కింద అత్యంత సమర్థవంతగా నిధుల వినియోగం చేస్తూ ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉంది. అందుకే కేంద్రం వద్ద జమ అయి ఉండే ఈ కంపా నిధులు 3,110 కోట్లను మన రాష్ట్రానికి ఇటీవల మంజూరు చేసింది. కాళేశ్వరంతో పాటు వివిధ ప్రాజెక్టులకు మళ్లించిన అటవీ భూములకు బదులుగా చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీ పెంపకం ఉధృతంగా కొనసాగుతోంది.

గడువు కంటే ముందే ఈ మొక్కలు నాటే పనులను పూర్తి చేయటంపై అటవీ శాఖ దృష్టి పెట్టింది. ఇక సహజంగా అటవీ పునరుద్దరణ, భూసార, తేమ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అగ్ని మాపక నిర్వహణ కార్యక్రమాలను కంపా నిధులతో చేపడుతున్నాము. ఇప్పటివరకు 28,862 హెక్టార్లలో బ్లాక్ ప్లాంటేషన్ చేశాము. 2.65 లక్షల హెక్టార్లలో క్షీణించిన అడవుల పునరుజ్జీవనం చేశాము. అటవీ ప్రాంతాల రక్షణ కోసం 8,287 కిలో మీటర్ల మేర కందకాలు ( ట్రెంచ్ లు) తవ్వాము.

వన్యప్రాణుల రక్షణ – చర్యలు :

తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండు టైగర్ రిజర్వులు అమ్రాబాద్, కవ్వాల్ లలో పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల వల్ల వీటి సంఖ్య 26కు పెరిగింది. వేసవిలో జంతుజాలం రక్షణ కోసం సోలార్ బోర్లు, వాటర్ సాసర్ల ఏర్పాటు, గడ్డి క్షేత్రాల పెంపుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.

అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ (ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్)

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో వినూత్నం నిర్ణయం ఫారెస్ట్ కాలేజీ ఏర్పాటు, తమిళనాడు కోయంబత్తూరు తరహాలో అటవీ సంబంధిత వృత్తి నిపుణులను తయారు చేసేందుకు, సిబ్బంది ప్రత్యేక శిక్షణకు ప్రత్యేక అటవీ కాలేజీని గజ్వేల్ సమీపంలో ఉన్న ములుగులో ఏర్పాటు చేశాం. అన్ని హంగులు, సౌకర్యాలతో త్వరలో ప్రారంభించేందుకు ఈ క్యాంపస్ సిద్దమౌతోంది.

తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర, సాంకేతిక శాఖ కూడా విద్యార్థులలో, యువకుల్లో శాస్త్ర పరిజ్ఞానం పెంపొందించటానికి అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా పేటెంట్ సేవలను ఇక్కడి నుంచి పొందవచ్చు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ ద్వారా విద్యార్థులకు పర్యావరణ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. జీవ వైవిధ్య మండలి ద్వారా తెలంగాణకే ప్రత్యేకమైన జీవవైవిధ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. జీవ వైవిధ్య మండలి ద్వారా బయోడైవర్సిటీ మేనేజ్ మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి పరిశ్రమలకు, కళాశాలలకు, వివిధ సంస్థలకు అవేర్ నెస్ ప్రోగ్రాములు చేపడుతున్నాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతున్నట్లు నివాసయోగ్యమైన వాతావరణం లేనప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నా లాభం లేదు. అందుకే తెలంగాణను రాష్ట్రాన్ని పర్యావరణ పరంగా అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా, భావి తరాలకు మంచి, కాలుష్య రహిత వాతావరణం అందివ్వటం మనందరి కర్తవ్యం. రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన, పచ్చని పర్యావరణం సమకూర్చేందుకు అడవుల అభివృద్ది, విస్తరణ, సంరక్షణతో జీవ వైవిధ్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందని తెలియచేస్తున్నాం. ఆ దిశగా అందరు శాసన సభ్యులు, ప్రజల సహకారాన్ని కోరుతున్నాం.

- Advertisement -