తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ సంక్షేమ పథకాలే తమ ప్రధాన ఎజెండా అని, అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని అటవీ, పర్యావరణ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ సమీపంలోని గండి రామన్న శ్రీ సాయి బాబా ఆలయంలో రూ. 25 లక్షలతో చేపట్టిన ఆలయ ప్రహారి గోడ, ఇతర అభివృద్ది పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్దికి నిధులు మంజూరు చేస్తున్నామని, నిర్మల్ జిల్లా ఉన్న ప్రధాన ఆలయాలను కూడా అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రజలల్లో కూడా ఆధ్యాత్మిక భావన పెరిగి ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని తెలిపారు. దేవాలయాలకు వచ్చే భక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ప్రజాప్రతినిదులు అభివృద్ధి పనుల్లో, రైతులు వ్యవసాయంలో, వివిధ వర్గాల ప్రజలు తమ తమ పనుల్లో బీజీగా ఉంటే… కొందరికి ఇది గిట్టడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి వారికి మనసున పడ్తలేదు. అందరూ ఏవరి పనుల్లో వారు బిజీగా ఉన్నాం, ఎవ్వరిపై మేము విమర్శలు చేయడం లేదు. ఓ పక్క ఇంత అభివృద్ధి జరుగుతుంటే… కొందరికి ఏమి తోచకుండా పొద్దు పోతలేదు. మొన్న ఏం పని పాట లేనోళ్లు నిర్మల్ కు వచ్చి పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ ఇక్కడ దర్నాలు చేశారు. నలుగైదురు కార్యకర్తలను వెనుకేసుకు వచ్చి రాజకీయ దురుద్దేశ్యంతో ఏది పడితే అది మాట్లాడారు.
మేము గుడులు కట్టిస్తున్నామా? గుళ్ళలోని లింగాలను మింగుతున్నామా? అన్నది ప్రజలకు తెలుసు. మీరు మాట్లాడేది ప్రజలు గమనిస్తున్నారు అన్నది మర్చిపోవద్దు. నోరును అదుపులో పెట్టుకోవాలి. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకొండి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకు కనుపడుత లేదా ?. మా ఓపికకు కూడా హద్దు ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. అవసరమైతే అబద్దాలు మాట్లాడినోళ్ళ నాలుక కోస్తాం. సరైన సమయంలో మేము కూడా ధీటుగా సమాధానం చెప్పుతాము. మీ విమర్శలే దీవెనలుగా మరిన్ని మంచి కార్యక్రమాలు తీసుకొస్తూ నిర్మల్ నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూనే ఉంటాము. మీ లాంటి వాళ్లు ఇంకా అద: పాతాళానికి పోతూనే ఉంటారు అని మంత్రి దుయ్యబట్టారు.