అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు- మంత్రి అల్లోల

141
Minister indrakaran reddy
- Advertisement -

అధికారులు ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. జూలై 1 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మంగ‌ళ‌వారం నిర్మల్‌ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాల‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి జిల్లా స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌కృతి వ‌నాలు, నర్సరీలలో పెంపకం, నాటిన మొక్కల సంరక్షణ, వైకుంఠ ధామాలు, డంప్‌ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, త‌దిత‌ర అంశాలపై అధికారుల‌కు మంత్రి దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాల‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, వీటిని విజయవంతానికి తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నూతన పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్దికి దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నార‌న్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో కూడా ప్రతినెలా గ్రామాల అభివృద్ధికోసం, రూ. 339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.148 కోట్లను విడుదల చేస్తున్నార‌ని తెలిపారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం మంత్రికి రూ.2 కోట్లు, కలెక్టర్‌కు రూ.కోటి కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించార‌ని మంత్రి చెప్పారు.

పల్లె పట్టణ ప్రగతి, హర‌తిహారం కార్యక్రమాలు మంచి ఫ‌లితాలు ఇస్తున్న‌ప్ప‌టికీ, ఇంకా చేయాల్సింది ఉంద‌ని, అధికారులు త‌మ బాధ్య‌త‌ల‌ నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. త‌మ‌కు అప్ప‌గించిన విధుల విష‌యంలో రాజీ ప‌డ‌కుండా ప‌నులు ప‌క్కాగా పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. పెండింగ్ ప‌నుల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టి ఇక‌నైనా వాటిని పూర్తి చేయాల‌ని చెప్పారు.

పల్లె ప్రగతిలో చేపట్టిన పనులపై ముఖ్యమంత్రి, ప్ర‌జాప్ర‌తినిదులు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. శ్మశానవాటికలు, డంప్‌యార్డులు, నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలను శుభ్రం చేయించాలన్నారు. ప్రజాప్ర‌తినిధులు, అధికారులు… ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ప‌ల్లె, ప‌ట్ట‌ణ‌ ప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్రమాల‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు.

ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ కే.విజ‌య‌ల‌క్ష్మి, క‌లెక్ట‌ర్ ముష్రాఫ్ అలీ ఫారూఖీ, నిర్మ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -