కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు,ఆశా వర్కర్లు,పోలీసులు,ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ తమ వంతు సహకారంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు నిత్యావసరాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
మరోవైపు నిర్మల్ జిల్లాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, కరోనా కేసులు కూడా తక్కువగా ఉన్నాయని సీయం కేసీఆర్ అభినందించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని, లాక్‌డౌన్ నేపధ్యంలో ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మారుగొండ రాము, రాంకిషన్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల గౌతంరెడ్డి, అల్లోల దివ్యారెడ్డి, అయ్యన్నగారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.