ఆయా రామ్ – గాయ రామ్ లతో తెలంగాణకు ఒరిగేదేమి లేదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బీజేపీ ఇలాంటి పది సభలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని..పదే పదే రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ తెలంగాణపై బీజేపీ విషం కక్కుతోందన్నారు.
బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని…నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదే పదే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పలేదన్నారు. తెలంగాణ అభివృద్దికి ఏం చేస్తారో చెప్పకుండా బీజేపీ స్వంత డప్పుకొట్టుకుందన్నారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్ తమ స్వంత డప్పు కొట్టుకోవడమే కానీ తెలంగాణ అభివృద్దికి ఏం చేస్తారో చెప్పలేదన్నారు. తెలంగాణ కు పనికొచ్చే మాట ఒక్కటీ కూడా చెప్పలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ మొసలి కన్నీరు కారుస్తాన్నారని, ధాన్యం కొనకుండా అరిగోస పెట్టినా పీయూష్ గోయల్ కు తెలంగాణ రైతన్నల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.