హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 8 జూ పార్కుల్లో సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అరణ్య భవన్ లో నిర్వహించిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(జపాట్) పదవ పాలకవర్గ సమావేశంలో వివిధ అంశాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, జూ పార్క్ డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటీ, జూ క్యూరేటర్ ఎన్. క్షితిజ, పాలకవర్గ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కోవిడ్ నేపథ్యంలో సందర్శకుల సంఖ్య తగ్గడంతో జూస్ & ఇతర పార్కుల్లో ఆదాయం తగ్గిందని అధికారులు మంత్రికి వివరించారు. కోవిడ్ వల్ల కొన్ని పార్కుల్లో ఎలాంటి ఆదాయం రాకపోడంతో వన్యప్రాణుల ఆహరానికి, నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు పాలక మండలి దృష్టికి తీసుకురాగా, ఇతర పార్కుల నుంచి నిధులు మళ్ళీంచాలని సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. సందర్శకులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే .. ఆదాయం పెంచుకునే మార్గాలపై సమావేశంలో చర్చించారు.
నెహ్రూ జూలాజికల్ పార్కుతో పాటు ఇతర పార్కుల్లో సందర్శకుల ఎంట్రీ ఫీజు పెంచాలనే ప్రతిపాదనపై చర్చించారు. దేశంలోని ఇతర పార్కుల్లో ఎంట్రీ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో పరిశీలించి, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు జూ పార్కుల్లో వైల‌్డ్ లైఫ్, స్నేక్ సొసైటీ లాంటి సంస్థల సహాకారంతో వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఇతర జూల నుంచి చింపాంజీ, జీరాఫీలను తెప్పించే ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది.