తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.. బుధవారం మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజి నిర్మాణ రైతులకు 38.61 కోట్ల నష్ట పరిహారం చెక్కులను 488 మంది రైతులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్యారేజ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన 50 మంది రైతులకు చెక్కులను అందించగా మిగతా రైతులందరికీ నష్ట పరిహారం గురువారం ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట మేరకు నిర్దిష్ట సమయంలో నష్ట పరిహారం అందిస్తున్నమని అన్నారు.
ఎన్నో సమస్యలు ఉన్న బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ రావుతో మాట్లాడి నష్ట పరిహారం త్వరగా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఖానాపూర్ నియోజకవర్గ రైతులకు 15 వేల ఎకరాల ఆయకట్టు వరకు నీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జూన్ వరకు పూర్తవుతుందన్నారు. దీని వల్ల జగిత్యాల జిల్లాకు రవాణా సౌకర్యం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన నాగదేవత ఆలయం ముంపునకు గురికావడంతో దాని సమీపంలో ఐదు ఎకరాల స్థలంలో రూ 35 లక్షలతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి మరికొన్ని నిధులను మంజూరు చేస్తామన్నారు. కమల్ కోర్టు, న్యూ టెంబుర్ని, ఆదర్శ్ నగర్,పొన్కల్ గ్రామాల రైతులు బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోయి నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొనక వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు.