పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కనకరాజుకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. తెలంగాణలోని ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కనకరాజుకు దక్కిన అరుదైన గౌరవమని మంత్రి పేర్కొన్నారు.
కనకరాజుకు పద్మశ్రీ రావడం తెలంగాణకు, ఆదివాసీ సమాజానికి దక్కిన గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కనకరాజు… గుస్సాడీ కళారూపంతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చారని ప్రశంసించారు. గుస్సాడీ కళ అంతరించి పోకుండా తర్వాతి తరం వాళ్లకు కూడా నేర్పిస్తున్నారని, పద్మశ్రీ అవార్డు రావడం మరింత మంది కళాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.