థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొందాం:హరీశ్ రావు

17
harishrao

కరోనా థర్డ్ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్ రావు. వైద్యశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదాం అన్నారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పని చేద్దాం అని… 15-18 ఏండ్ల వారి వ్యాక్సినేషన్ వేగం పెంచాలన్నారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్సీల్లో ఐసోలేషన్, పరీక్ష కిట్లు ఏర్పాటుచేశామని తెలిపారు. లక్షణాలు ఉంటే పరీక్ష చేసి, వెంటనే కిట్లు అందించాలని సూచించారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీగా పరిశీలించాలని…. ప్రజలు ప్రైవేటుకు వెళ్లి అప్పులపాలు కావొద్దన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని… కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, ప్రమాదం తక్కువ అన్నారు. కోవిడ్ పై పోరులో మున్సిపల్, పంచాయతీ శాఖలతో పాటు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్, కరోనా చికిత్స పట్ల ప్రజలను చైతన్య పరచాలన్నారు. నాన్ కోవిడ్ సేవలకు ఎట్టిపరిస్థితుల్లో అంతరాయం కలగొద్దని సూచించిన హరీశ్ రావు… ఆశాల సేవలకు గుర్తింపుగా సీఎం పారితోషకం పెంచారన్నారు

అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు హరీశ్ రావు. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధత, వ్యాక్సినేషన్, వైద్య సేవలు తదితర అంశాలపై ముఖ్యమైన సూచనలు చేశారు. జనవరి 10వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యం ఇచ్చి, రెండు డోసులు పూర్తి చేసి, బూస్టర్ డోస్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశాల పరిధిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ఒక్కరు ఉండకూడదనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.