సెస్‌ల రూపంలో దొడ్డిదారిన పన్నుల వసూలు

99
harishrao
- Advertisement -

“బలహీన రాష్ట్రాలు – బలమైన కేంద్రం” అనేది బీజేపీ సిద్ధాంతం అని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్‌ పూల్‌లోనే పన్నులు వసులు చేయాలని మంత్రి హరీశ్‌ రావు తీర్మానం ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమ సిద్ధాంతాన్ని అమలు పరచడంలో భాగంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీన పరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. ఈ కుతంత్రాల ద్వారా సంక్షేమరాజ్య భావనకే ముప్పు తెస్తున్నది. కేంద్ర వైఖరి రాజ్యాంగ ప్రవేశికలో (Preamble) పేర్కొన్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయ సాధనకు పూర్తిగా వ్యతిరేకమైనది…కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్దంగా 41శాతం వాటా రాషాలకు చెల్లించాలి. కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి గండి కొడుతున్నది. అంటే రాష్ట్రాలకు 41శాతం వాటా రావాల్సిన చోట 29.8 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తుందన్నారు.

2021-22 నుంచి 2025-28 నాటికి ఐదేళ్లకాలంలో రాష్ట్రాలకు పంచవలసిన డివిజబుల్ పన్ను మొత్తం జీడీపీలో 38.47 శాతం ఉండగా, కేంద్రం దొడ్డిదారిన విధిస్తున్న సెస్ జీడీపీలో 12.10 శాతంగా ఉండబోతోందని 15వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక పేర్కొన్నది. రాష్ట్రాలకు 82 శాతం ఖర్చులుంటే 37 శాతం రెవెన్యూ మాత్రమే వస్తోందనీ, కేంద్రానికి 38 శాతం ఖర్చు మాత్రమే ఉంటే 69 శాతం ఆదాయం వస్తోందని ఫైనాన్స్ కమిషన్ అభిప్రాయపడిందన్నారు.

2013-14లో 1.41 లక్షల కోట్ల సెస్ మాత్రమే ఉండగా, మోడీ ప్రభుత్వం 2021 నాటికి 4.81 లక్షల కోట్లకు పెంచేసుకున్నది. అంటే ఈ 4.81 లక్షల కోట్ల రాబడిలో రాష్ట్రాలకు పంచి ఇవ్వాల్సిన వాటా ఎగొడుతున్నది. 2011-12 నాటికి దేశ ప్రజలు చెల్లిస్తున్న పన్నులలో సెస్ 10శాతంగా మాత్రమే ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం నేడు దాన్ని 20శాతానికి పెంచేసింది. ఈ పెరుగుదల న్యాయబద్దం కాదని భావించిన 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్లు సెస్ విధింపుల ద్వారా వచ్చే రాబడిని కూడా రాష్ట్రాలకు పంచి ఇచ్చేందుకు వీలుగా డివిజబుల్ పూల్ లోనే పెట్టాలని, అందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని సూచించాయి.కానీ నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సూచనలను బేఖాతరు చేస్తూ నిస్సిగ్గుగా రాష్ట్రాల ఆదాయాలను కొల్లగొడుతున్నది.15వ ఆర్థిక సంఘం అంచనాలననుసరించి కేంద్రం పన్నుల రాబడి మొత్తం 2021-28లో 195 లక్షల కోట్లయితే, అందులో సెస్ రూపేణా వసూలు చేసే 32 లక్షల కోట్లుగా ఉండబోతున్నది. ఇది సుమారు 23.7 శాతంగా ఉండబోతుందని ఆర్థిక సంఘం లెక్కలేసిందన్నారు.

సెస్ ల పేరుతో చేస్తున్న వసూళ్ల ఫలితంగా కేంద్రం పన్నుల్లోంచి రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల శ్రేయస్సు కోసం తాము అనుకున్న విధంగా సంక్షేమ చర్యలు చేపట్టలేక పోతున్నాయి. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కుంటు పడుతున్నది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధ పోకడలను టీఆర్ఎస్ విస్తృత సభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇకనుంచీ సెస్ ల రూపంలో దొడ్డిదారిన వసూలు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి డివిజబుల్ పూల్ లోనే పన్నులు వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానిస్తుందన్నారు.

- Advertisement -