70 వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు..: హరీశ్

68
harishrao

ఇప్పటివరకు 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు మంత్రి హరీశ్‌ రావు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కరోనా, ధాన్యం కోనుగోలుపై సమీక్ష నిర్వహించిన హరీశ్.. 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 91 కోట్లు రైతుల‌ ఖాతాలలో జ‌మ చేసిన‌ట్లు చెప్పారు. లేబ‌ర్ కొర‌త లేకుండా చూసుకోవాల్సిందిగా రైస్ మిల్లుల అధ్యక్షులు చందపాల్‌కు మంత్రి సూచించారు.

కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మన జిల్లాలో 581 బృందాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల ఇళ్లను సర్వే చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, ఇతర మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరు స్వీయ నియంత్రణ పాటించేలా ప్రజా ప్రతినిధులు చూడాలని, మాస్కు ధరించని వారికి రూ. 500 జ‌రిమానా విధించాల్సిందిగా సూచించారు.

అనంత‌రం నాలుగు మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల ప్రగతి, తూప్రాన్‌లో రోడ్ వెడల్పుకు స్థలాల అప్పగింత తదితర అంశాలపై సంబంధిత కమిష‌నర్ల‌తో మంత్రి స‌మీక్షించారు. అనంతరం మార్కెట్ కమిట్ వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంబించారు.