అనారోగ్య కారణాలతో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోగా మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
రామలింగారెడ్డి అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని…ఆయన మరణం ఉమ్మడి మెదక్ జిల్లాకు, తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని…. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకోసం పరితపించిన నాయకుడని కొనియాడారు.
పత్రికారంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతి శీల, తెలంగాణ ఉద్యమకారుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణవార్త తనకు తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని అసెంబ్లీ స్పీకర్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, దుబ్బాక ప్రజలకు, టీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటన్నారు.
ఉద్యమ మిత్రుడు దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. రామలింగారెడ్డి మరణం పట్ల శాసనసభ వ్యవరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదల పక్షపాతి అని, నిగర్వి అని, అలాంటి వ్యక్తి మృతి బాధాకరమన్నారు మంత్రి ఈటల రాజేందర్.