రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు, ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలి. కరోనా టీకాలు రెండవ డోస్ కూడా అందరూ తప్పనిసరిగా వేసుకోవాలి. జన రద్దీ ప్రాంతాలలో మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గర్భిణీలు కరోనా టీకాలు తీసుకోవద్దనే అపోహలు వద్దని, అందరూ తీసుకోవచ్చునని వైద్యులే చెబుతున్నారని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.., మీరు కోరితే మీ ఇంటింటికీ వచ్చి కరోనా టీకాలు వేయిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట 27వ మున్సిపల్ వార్డు గణేష్ నగర్ లో రూ.15 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనార్థం, ప్రజల మనస్సులో ఉన్నది నెరవేర్చడమే మా ప్రయత్నం అని పేర్కొన్నారు. గణేష్ నగర్ మహిళా భవన నిర్మాణం పదేళ్ల పంచాయతీ ఇవాళ్టితో నెరవేరిందని, ఇంకా అదనంగా కాంపౌండ్ వాల్ కోసం కావాల్సిన నిధులు, 6వ వార్డులో మహిళా భవనం మరమ్మత్తులకు అవసరమైన నిధులు సమకూర్చి 3 నెలల్లోపు పూర్తి చేస్తామని ఆయా వార్డు ప్రజలకు మాట ఇచ్చారు.
విద్య, వైద్యం, మౌళిక వసతుల కల్పనలో సిద్ధిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని, రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలుపుకుంటున్నట్లు, గతంలో పట్టణంలో తాగునీటి గోస తీవ్రంగా ఉండేదని, ఇవాళ మిషన్ భగీరథతో నీటి కష్టాలకు చెక్ పడిందన్నారు.వార్డుల్లో యూజీడీ పనులు వెంటనే చేయించాలని అధికారులను ఆదేశిస్తూ.., నల్లా నీళ్ల తరహాలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేలా గ్యాస్ పైపు లైన్లు వేయిస్తున్నామని, తొందరగా పైపు లైన్లు పనులు పూర్తి చేయించి, రోడ్లు వేసుకుందామని ప్రజలకు మంత్రి వివరించారు. యూజీడీ కోసం ప్రజలు సహకరించాలని, దీంతో దోమలు, ఈగలు, రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
పట్టణంలో పందులు, కోతులు, కుక్కల బెడద తప్పిందని, సురక్షిత సిద్దిపేట కోసం పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య సిద్దిపేట కోసం అభివృద్ధి పనులు చేస్తున్నామని, ప్లాస్టిక్ రహిత సిద్ధిపేట దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రజలంతా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని స్టీల్ బ్యాంకులు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ఆరోగ్యంగా ఉండేందు కోసం యోగా, వాకింగ్ చేయాలని ప్రజలను కోరారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం త్వరలోనే కల్పిస్తామని చెప్పారు.
తడి, పొడి, హానికరమైన చెత్తలను వేర్వేరుగా ఇచ్చి స్వచ్ఛ సిద్ధిపేటకు సహకరించాలని, అలాగే సిద్ధిపేట బురుజు వద్ద ఏర్పాటైన స్వచ్ఛబడికి పోవాలని, అక్కడ చెత్త ద్వారా ఎరువు తయారు చేసే విధానం, చెత్తతో అనర్థాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు వివరిస్తారని, ప్రజలు అవగాహన పొంది స్వచ్ఛ సిద్ధిపేటకు సహకారాన్ని అందించాలని కోరారు.